Hydra Crossed ORR Limits and Focus on Ibrahimpatnam : హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం రెండు నెలల కిందట ఏర్పాటైన హైడ్రా ఆక్రమణదారుల్లో దడ పుట్టిస్తోంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివాసం కోసం కాకుండా వ్యాపార నిమిత్తం చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధితోపాటు శివారు ప్రాంతాల్లో 26 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి కోట్లాది రూపాయలు విలువ చేసే 119 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ విశేషాధికారాలు కల్పించింది. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే ఇటీవల ఔటర్‌ను ఆనుకొని ఉన్న 51 గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. వాటి వరకు హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రోజురోజుకు మరింత బలాన్ని పుంజుకుంటున్న హైడ్రా, ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుకు సాగుతోంది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులన్నింటిపై దృష్టి సారించిన హైడ్రా, గ్రేటర్ పరిధిలోని 185, హెచ్ఎండీఏలోని 3 వేలకుపైగా చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
ఇబ్రహీంపట్నం చెరువులపై హైడ్రా దృష్టి : వాటిలో ఇప్పటికే 60 శాతంపైగా చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాగా అందులో అత్యంత దారుణంగా కుంచించుకుపోయిన వాటిని గుర్తించి తొలి ప్రాధాన్యతగా ఆక్రమణలు తొలగించేందుకు కృషి చేస్తోంది. రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు సంగారెడ్డిలో పెద్దఎత్తున ఆక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఓవైపు కూల్చివేతలు, మరోవైపు క్షేత్ర స్థాయిలో అధికారుల సర్వేలతో ఎప్పటికప్పుడు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోనే సాగిన హైడ్రా కూల్చివేతల ప్రక్రియ ఇకపై ఔటర్ దాటనున్నట్లు తెలుస్తోంది.
ఔటర్ రింగు రోడ్డుకు అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. స్థానిక మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు, చిన్న చెరువు పరిధిలోని ఆక్రమణలపై ఆరా తీశారు. వాటి సమీపంలో ఉన్న ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్ గూడా గ్రామాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను తనిఖీ చేశారు. చెరువులోకి వరద నీరు మోసుకొచ్చే ఫిరంగినాలా సహా ఇతర వరద కాలువల వివరాలను స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారంలోగా సమగ్ర వివరాలు హైడ్రాకు సమర్పించాలని ఆదేశించారు.