Hydra Demolition Ramnagar Illegal Constructions :హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలకు దిగింది. మూడు ప్రత్యేక బృందాలుగా దాదాపు 70 మంది డీఆర్ఎస్ హైడ్రా కూల్చివేత ప్రత్యేక సిబ్బంది వచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. 1-9-18/9 సర్వే నెంబర్ గల స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా రోడ్డును కబ్జా చేసి, ఆ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
పరిశీలించిన రెండు రోజుల్లోనే నిర్మాణాలు కూల్చివేత : రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వీటిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధరించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు.
ఫిర్యాదు ఇచ్చిన రెండ్రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా వరద నీరు వెళ్లేందుకు మార్గం మూసుకోవడంతో ఏటా వర్షా కాలంలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడం, ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికంగా పలు ఇబ్బందులు గురవుతున్నామని అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఇక తాజాగా హైడ్రా చర్యలతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
అక్కడి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి, కూల్చివేతలు : గతంలో రెండు పర్యాయాలు ఈ అక్రమ నిర్మాణంపై పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ డెమోలిషన్స్ స్క్వాడ్ భారీ పోలీసు పహారాతో కూల్చివేయడానికి వచ్చి వెను తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 24 అడుగుల వెడల్పు గల లింకు రోడ్డును కబ్జా చేసి ఆస్థలంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో ఒకవైపు కల్లు కాంపౌండ్, ఓ బారు కొనసాగుతోంది. ఎట్టకేలకు హైడ్రా కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అక్రమ కల్లు కాంపౌండ్ కూల్చివేతతో పాటు రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయడానికి సిబ్బంది ఉపక్రమించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.