Hydra Demolitions Illegal Structures in Madhapur : రాజధాని పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణనే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. ఆదివారం నుంచి కూల్చివేతల్లో నిమగ్నమైన హైడ్రా బుల్డోజర్లు ఇవాళ కూడా ఆక్రమణల అంతు చూస్తున్నాయి. సోమవారం (సెప్టెంబరు 23వ తేదీ) మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా కూల్చేసింది.
పార్కు స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు కూల్చివేశాం :హైకోర్టు ఆదేశాల మేరకు కావూరిహిల్స్లో పార్కు ప్రదేశాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు కావూరి హిల్స్ పార్క్ కూల్చివేతలకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు.