Hydra Commissioner Ranganth Visits Ameenpur :అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. శంభునికుంట, వెంకరమణ కాలనీ, అమీన్‌పూర్ పెద్ద చెరువు, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మరావు నగర్ సరిహద్దు ప్రాంతాలను పరిశీలించిన రంగనాథ్ అక్కడి స్థానికులతో మాట్లాడారు. స్థానికంగా భూములు ఆక్రమించి వేసిన లేఅవుట్లు, ఇతర సమస్యలపై పలువురు స్థానికులు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ అమీన్‌పూర్ పెద్ద చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు తమకు అందాయని తెలిపారు. పెద్ద చెరువు అలుగులు, తూములు మూసేయడం వల్ల ఎఫ్‌డీఎల్ పెరిగిందని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేకమైన టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామన్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వంతో చర్చించి 3 నెలల్లో ఫలితాలతో మళ్లీ వస్తామన్నారు.
రోడ్లు, పార్కులు ఆక్రమణకు గురైనట్లు కంప్లైంట్లు :"పద్మావతి లేఅవుట్నకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమణలకు పాల్పడినట్లుగా కొందరు మా దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, పార్కులు కబ్జాకు గురైనట్లు కంప్లైంట్లు వచ్చాయి. విచారణ చేసి అవి నిజం అని తేలితే హైడ్రా చర్యలు తీసుకుంటుంది" అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.