Hydra Commissioner in Pedda Amberpet : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌లోని కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు నిన్నటి నుంచి సర్వే ప్రారంభించారు. హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న కుంట్లూరు పెద్ద చెరువు స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు పరీశీలించారు. చెరువులో ఏకంగా మున్సిపల్ శాఖ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చెరువు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)లో రోడ్డు వేసేందుకు నిధులు ఎలా కేటాయిస్తారని రంగనాథ్ నిలదీశారు. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి చెరువు పట్టా, భూమి బార్డర్లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి ఆయన సూచించారు. చెరువుకు సంబంధించిన భూమిలో రోడ్డు వేస్తే మాత్రం వెంటనే తొలగించాలని హైడ్రా సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
ఏకంగా 96 ఎకరాల చెరువునే! : చెరువులో రోడ్డు నిర్మాణం థర్డ్ పార్టీ చేశారని పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి హైడ్రా కమిషనర్‌కు నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోడ్డు వ్యవహారం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ రోడ్డును ఏర్పాటు చేసినప్పుడు వారిపై కేసులు పెట్టాలి. యాక్షన్ తీసుకోవాలి కదా? ఇవన్ని ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కుంట్లూరులోని 185వ సర్వే నెంబర్లలోని దాదాపు 96 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందంటూ హైడ్రాకు స్థానికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు నిన్ననే హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని సర్వే పనులు ప్రారంభించారు.