Hydra Demolitions At Alkapuri Township :హైదరాబాద్ మహానగరంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్-2019 ప్రకారం హైడ్రాకు లభించిన హక్కుల మేరకు జీహెచ్‌ఎంసీ మినహా ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో కూల్చివేతలు చేస్తున్నట్లు తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలోని అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయాల షట్టర్లను హైడ్రా తొలగించింది. యజమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా అపార్ట్‌మెంట్‌లోని 38మంది నివాసితుల ఫిర్యాదు మేరకే తొలగించినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.
అనుమతులు లేకుండా వాణిజ్య కార్యకలపాలు :భాగ్యనగరంలో హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. మణికొండ మున్సిపాలిటీ పరిధి అల్కాపురి టౌన్‌షిప్‌లోని అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌లో రెసిడెన్షియల్ పేరుతో అనుమతి తీసుకుని వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు 4 షట్టర్లను తొలగించింది. 2016లో హెచ్‌ఎండీఏ అనుమతులతో రామిరెడ్డి అనే వ్యక్తి మార్నింగ్ రాగా పేరుతో 5ఫ్లోర్ల అపార్ట్‌మెంట్ నిర్మించారు. అందులో నివసిస్తున్న వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్యాంకు, నిత్యావసర సరకులు, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఇదే అంశంపై అపార్ట్‌మెంట్‌లోని 38 మంది హైడ్రాకు, స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 7న వాటిని పరిశీలించిన రంగనాథ్ అనుమతులు లేని వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందే మున్సిపల్ అధికారులు సైతం 2 సార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు యజమాని నుంచి స్పందన రాకపోవడంతో షట్టర్లను హైడ్రా తొలగించింది.
ఆ కట్టడాలను హైడ్రా కూల్చదు - రంగనాథ్ మరో కీలక ప్రకటన
సమయం ఇచ్చాకే కూల్చివేతలు : స్థానిక నివాసితుల ఫిర్యాదుల మేరకే మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్ షెట్టర్ల తొలగింపు జరిగినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2 వారాల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంగనాథ్ స్థానిక నివాసితులు, వాణిజ్య సముదాయాలను నిర్వహిస్తున్న యజమానిని ఎదురెదురుగా ఉంచి విచారించారు. హెచ్‌ఎండీఏ, హైడ్రా, మున్సిపాలిటీ విభాగాలకు నివాసితులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారించి వ్యాపారానికి అనుమతులు లేవని నిర్ధారించారు. షోకాజ్ నోటీసులతో పాటు తగిన సమయం ఇచ్చాకే హైడ్రా సమక్షంలో కూల్చివేతలు జరిగినట్లు తెలిపారు.
"ఇక్కడ షాపులు నడపడానికి కమర్షియల్ లైసెన్స్ ఉంది. గత ఐదు సంవత్సరాలు కమర్షియల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్నాం. దీన్ని నమ్ముకుని 70మంది ఉద్యోగుల జీవితాలు ఉన్నాయి. ఎలాంటి సమాచరం లేకుండా మున్సిపాలిటీ, హైడ్రా అధికారులు వచ్చి కూల్చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావడం లేదు."- బాధితుడు
హైడ్రాకు దక్కిన అనుమతులు మేర కూల్చివేతలు : జీహెచ్‌ఎంసీ మినహా ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో హైడ్రాకు దక్కిన హక్కుల మేరకు కూల్చివేతలకు ఆదేశాలిచ్చినట్లు రంగనాథ్ తెలిపారు. అనుమతి లేని వ్యాపార సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించడం జరుగుతుందన్నారు. చిరు వ్యాపారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్.. స్థానిక నివాసితులకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. 2024 జులైకి ముందు అనుమతులు లేని వాణిజ్య సముదాయాల కూల్చివేతలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు. నోటీసుల విషయాన్ని అక్కడి వ్యాపారులకు చెప్పకుండా మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ యజమాని తప్పుదోవ పట్టించారని రంగనాథ్ వివరించారు.
"ఆ ఇళ్లను కూల్చం - వీటిని వదలం" : హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
కుంట్లూరు చెరువులో నుంచి రహదారి ఎలా వేస్తారు? - రంగనాథ్ సీరియస్