Hydra Commissioner Ranganath Clarify On Demolitions :రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించి ఉన్న నివాసాలను కూల్చబోమని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త నిర్మాణాలు చేపడితే కచ్చితంగా కూల్చివేస్తామని వెల్లడించారు. మాదాపూర్ సున్నంచెరువు, దుండిగల్ మల్లంపేట చెరువుల పరిధిలోని నివాసాల కూల్చివేతపై నిరసనలు వ్యక్తమవడంతో స్పందించిన రంగనాథ్, ఆ నిర్మాణాలన్నీ అక్రమమని నిర్ధారించడం వల్లే హైడ్రా చర్యలు తీసుకుందన్నారు.
మల్లంపేట కత్వా చెరువులో ఎలాంటి అనుమతి లేకుండా విల్లాలు నిర్మించారని, పంచాయతీ నుంచి నకిలీ అనుమతులు పొందారని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ తనకు నివేదిక సమర్పించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కూల్చివేసిన విల్లాలన్నీ రెండేళ్ల కిందట సీజ్ చేశారని, అందులోకి ఎవరూ రాలేదని తెలిపారు.ఎలాంటి అనుమతులు లేకుండా తప్పుడు ఆధారాలు సమర్పించి నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు కారణమైన బిల్డర్ లేడీ డాన్ విజయలక్ష్మిపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Hydra Focus On Illegal Constructions :స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడి ఉపయోగించుకొని విజయలక్ష్మి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆమెపై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు రంగనాథ్ వివరించారు. అలాగే అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్‌కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను తొలగించామని రంగనాథ్ తెలిపారు.
ఈ నిర్మాణాలు కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినవిగా తేలిందని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రంగనాథ్ వివరించారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పదెకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెరువులను ఆక్రమించడంలో ఆక్రమణదారులు వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు హైడ్రా గుర్తించిందన్నారు.