Hyderabad Police Decoy Operation : మహా నగరంలో రాత్రివేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని ముమ్మరం చేశారు. దొంగలు, స్నాచర్లు, అసాంఘిక శక్తులను మాటు వేసి పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందుకోసం డెకాయ్ ఆపరేషన్‌ల బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కూడా సిబ్బంది, అధికారుల పనితీరును రాత్రి వేళల్లో ఆకస్మికంగా పరిశీలిస్తున్నారు. వివిధ ఠాణాల్లో అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారుల పర్యటనతో అప్రమత్తమయ్యారు.
నగరంలో సెల్‌ఫోన్ స్నాచర్లు హల్‌చల్ చేస్తున్నారు. పాదచారులు, ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కొని పారిపోతున్నారు. ఒక్కో బృందంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్, ఇద్దరు ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లుంటారు. ప్రజల మధ్య సివిల్ దుస్తుల్లో ఉంటూ గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లను కట్టడి చేయటమే ఈ బృందాల బాధ్యత. రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాపులు, రైల్వేస్టేషన్లపై నిఘా ఉంచి సెల్‌ఫోన్ స్నాచర్లను కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక బృందం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలుగడ్డ బావి వద్ద డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు.
తమ ప్లాన్‌లో భాగంగా ముగ్గురూ తమ చేతుల్లోకి సెల్‌ఫోన్లు తీసుకొని వీడియోలు చూస్తున్నారు. సుమారు 2 గంటల సమయంలో అదే మార్గంలోకి వచ్చిన నలుగురు యువకులు ఆ ముగ్గురి వద్ద సెల్‌ఫోన్లు కొట్టేసేందుకు చక్కర్లు కొట్టారు. అదను చూసి ఒక కానిస్టేబుల్ చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ముగ్గురు కానిస్టేబుళ్లు నలుగురు స్నాచర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. సినీ ఫక్కీలో నిందితులను వెంటాడి పట్టుకున్నారు. తప్పించుకునేందుకు నలుగురు నిందితులు కానిస్టేబుళ్లపై దాడికి దిగారు.
ఆత్మ రక్షణ కోసం కాల్పులు : దీంతో ప్రాణరక్షణ కోసం ఆ బృందంలోని ఒక కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు అక్కడకు చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా తార్నాక, లాలాగూడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతూ, ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలతో ఈ నలుగురికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.