Mobile Thieves in Hyderabad :హైదరాబాద్ మహానగరంలో రోజుకు రోజుకు పెరుగుతున్న గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లు, దోపిడీ దొంగల భరతం పట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏడు పోలీసు జోన్ల పరిధిలో డీసీసీ నుంచి హోంగార్డు స్థాయి వరకు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. వివిధ నేరాల్లో తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్తులపై నిఘా పెంచారు. స్థానిక పోలీసులు, యాంటీ స్నాచింగ్ టీమ్స్ నేరస్తుల కదలికలను గమనిస్తున్నారు. అనుమానితులు, ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. మూడ్రోజుల వ్యవధిలో సుమారు 150 కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని అన్ని ఠాణా పరిధుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చరవాణుల చోరీ కేసుల్లో అత్యంత కఠినంగా పోలీసులు వ్యవహారిస్తున్నారు. నగరంలో సగటున 30-40 మొబైల్‌ఫోన్లు మాయమవుతున్నట్టు పోలీసుల అంచనా. సిటీబస్సులు, మెట్రోరైళ్లు, ఆటోల్లో ప్రయాణికుల మధ్య చేరిన చిల్లర దొంగలు వీటిని కొట్టేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సమయాల్లో పాదచారులు, ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించే వారిని లక్ష్యం చేసుకొని ఆగడాలకు పాల్పడుతున్నారు.
మద్యం, గంజాయి మత్తులో స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దుండగులు, బాధితులు ఎదురుతిరిగితే హతమార్చేందుకు తెగిస్తున్నారు. విదేశీ ముఠాలు కూడా కొట్టేసిన ఫోన్లను కొనుగోలు చేయటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ ముఠాల ఆగడాలకు కళ్లెం వేసేందుకు సీపీ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసింది. యాంటీ స్నాచింగ్ టీమ్స్ ద్వారా 10 మంది సెల్‌పోన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సైదాబాద్, చిలకలగూడలో ఎదురుతిరిగిన స్నాచర్లపై పోలీసులు కాల్పులు జరిపారు.