MMTS Train Timing Issue In Hyderabad : వర్షం ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు రాదో చెప్పవచ్చు కానీ ఎంఎంటీఎస్ సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో ఎప్పుడు రద్దవుతాయో చెప్పడం కష్టం. వీటిని నమ్ముకున్న విద్యార్థులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులకు, అవస్థలకు గురవుతున్నారు. ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు సమయ పాలన పాటించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే ఏమాత్రం కనికరం చూపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఎంఎంటీఎస్‌లపై ఎందుకీ నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు.
ఆలోచన గొప్పదే కానీ ఆచరణ శూన్యం :ప్రయాణికుల అవసరాలను గుర్తించి వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మల్టీ మోడల్ ట్రాన్స్ ఫోర్ట్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నిరుపేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2003లో అప్పటి భారత ఉప ప్రధాని ఎల్.కే.అడ్వాణీ చేతుల మీదుగా ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్‌లు :ప్రారంభంలో ఆరు కోచ్‌లు 30 సర్వీసులు నడిచేవి. వీటిలో నిత్యం 25 వేల ప్రయాణికులు ప్రయాణించేవారు. కాలానుగుణంగా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను 121కి పెంచారు. ఒక్కో సర్వీసులో 12 కోచ్‌లకు చేరుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు కేవలం షెడ్డుకే పరిమితమయ్యాయి. ఆ సమయంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత నుంచి ప్రస్తుతం 88 ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.
ఎంఎంటీఎస్ రైళ్లలో సాంకేతికతకు పెద్ద పీఠ :ఎంఎంటీఎస్ రైళ్లలో సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. పాత ఎంఎంటీఎస్ రైళ్లలో 700ల మంది కూర్చుని 2000 మంది నిల్చుని ప్రయాణించే వారు. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లలో 1,150 మంది కూర్చుని 4 వేల మంది నిల్చుని ప్రయాణించే అవకాశముంది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే బోగీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విశాలమైన బోగీలను ఏర్పాటు చేశారు. కిటికీలకు జాలీలను ఏర్పాటు చేశారు. వీటితో మహిళా ప్రయాణికులకు పెద్ద పీఠ వేశామని రైల్వే అధికారులు అంటున్నారు.
ఎంఎటీఎస్ల ప్రత్యేకతలు ఇవే :ప్రస్తుతం ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు సికింద్రాబాద్-నాంపల్లి, సికింద్రాబాద్-ఫలక్ నుమా, ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. కొత్త ఎం.ఎం.టి.ఎస్ రైళ్లలో ఎల్ఈడీ బోర్డులు, మైక్‌లో స్టేషన్ల వివరాలు వెల్లడించడం, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, వెలుతురు బాగా ప్రసరించేలా బోగీలను ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే ఆకర్షణీమైన రంగులతో రైలు బోగీలను తీర్చిదిద్దారు.
అత్యాధునిక సాంకేతికతో బ్రేకింక్ విధానం, ఇంజిన్లు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు సౌకర్యవంతమైన సీట్లను ఏర్పాటు చేశారు. నిల్చుని ప్రయాణించే ప్రయాణికుల కోసం హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కువ సామన్లు తరలించేందుకు విశాలమైన బోగీలను తయారు చేశారు. పాత ఎం.ఎం.టి.ఎస్ రైళ్లతో పోల్చుకుంటే కొత్త ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులను అత్యాధునికంగా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు :ప్రస్తుతం ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు ఘట్కేసర్ - లింగంపల్లి, మేడ్చల్ - సికింద్రాబాద్, ఫలక్‌నుమా - లింగంపల్లి, హైదరాబాద్ -లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్ నుమా రూట్లలో తిరుగుతున్నాయి. ఘట్కేసర్ -లింగంపల్లి రూట్లో ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు ఘట్కేసర్ - చర్లపల్లి, మౌలాలి, నేరేడ్మెట్, సుచిత్ర, సనత్‌నగర్ స్టేషన్ల మీదుగా లింగంపల్లి వెళతాయి. మేడ్చల్-సికింద్రాబాద్ రూట్లో ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు లాలాగూడ గేట్, మల్కాజిగిరి, దయానంద నగర్, సఫిల్ గూడ, ఆర్.కే.పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్ల మీదుగా వెళతాయి.