ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త సిటీలోకి మెట్రో పరుగులు- రెండో దశ డీపీఆర్‌కు తుదిమెరుగులు - HYDERABAD METRO PHASE 2 DPR - HYDERABAD METRO PHASE 2 DPR

Hyderabad Metro Phase 2 DPR : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మలిదశ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తసిటీలోకి మెట్రో రైలు వెళ్ళేలా ప్రణాళికలు రూపొందించారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు

Hyderabad Metro Phase 2
Hyderabad Metro Phase 2 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2024, 6:35 PM IST

Airport Metro Alignment Changes in Hyderabad : మెట్రో రైలు రెండో దశ డీపీఆర్​లను అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. డీపీఆర్​లు తుది దశకు చేరుకున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారీ పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్​మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్​లు మొదలైన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కారిడార్​లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్‌ఏఎంఎల్ ఎదురుచూస్తోందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి తెలియజేశారు.

ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు :మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్-చెక్ చేయాల్సి ఉంటుంది. రెండవ దశ మెట్రో కారిడార్​లు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం డీపీఆర్​లను సమర్పించడానికి ఇది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం, ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్​ను ఆరాంఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

"ఇటీవలే మెట్రోరైలు రెండో దశ డీపీఆర్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఆరాంఘర్- బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో ఖరారు చేశారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు ఏర్పాటుకు ఆదేశించారు."-ఎన్వీఎస్​ రెడ్డి, హైదరాబాద్​ మెట్రో ఎండీ

ఏపీలో మెట్రో ప్రాజెక్టులు పరుగులు - నాలుగు కారిడార్లుగా విశాఖ, రెండు దశల్లో విజయవాడ - అమరావతి - Metro Rail Projects in AP

9 కారిడార్లలో పరుగులు తీయనున్న మెట్రో రైలు :ఎయిర్​పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్​ల విస్తృత కాంటూర్​లను ఆమోదించారు. వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. కారిడార్ -4లో : నాగోల్ - ఆర్​జీఐఏ (ఎయిర్ పోర్ట్ కారిడార్) వరకు 36.6 కి.మీ వరకు, కారిడార్ -5లో : రాయదుర్గ్ -కోకాపేట్ నియోపోలీస్ వరకు 11.6 కి.మీలు వరకు, కారిడార్ - 6లో : ఎంజీబీఎస్ - చాంద్రాయన్​గుట్ట వరకు (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కి.మీ వరకు నడవనున్నాయి.

కారిడార్ -7లో : మియాపూర్ - పటాన్ చెరు వరకు 13.4 కి.మీ వరకు, కారిడార్ -8లో : ఎల్బీ నగర్ - హయత్​నగర్ వరకు 7.1 కి.మీ వరకు, కారిడార్ -9లో : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కి.మీ వరకు మెట్రో రైల్ నిర్మాణం చేయనున్నారు. రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ -4 (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవును కవర్ చేస్తుంది.

ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్​డీఓ, చాంద్రాయన్​ గుట్ట, మైలార్‌దేవ్‌ పల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్.హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్ లైన్ వరుసగా నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రో లైన్‌లకు అనుసంధానించబడుతుంది. ఈ కారిడార్ మొత్తం 36.6 కి.మీ పొడవులో, 35 కి.మీ ఎలివేట్ చేయబడుతుంది. అలాగే 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ ఎయిర్ పోర్ట్ స్టేషన్​తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి.

చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లలో మార్పులు లేవు : కారిడార్ -5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలీస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్​రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలీస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతుంది. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ -6 (ఓల్డ్ సిటీ మెట్రో) ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతుంది. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీ రోడ్ మీదుగా దారుల్‌ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌ నుమా మీదుగా ప్రయాణిస్తుంది.

కారిడార్ సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా ఉంచారు. ప్రస్తుతం దారుల్‌ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు ఏకరీతిగా 100 అడుగులకు విస్తరించడం జరుగుతుంది. స్టేషన్ ఉండే ప్రాంతాలలో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరించడం జరుగుతుంది.

హైదరాబాద్​లో అండర్ ​గ్రౌండ్ మెట్రో - ఎయిర్​పోర్టు కారిడార్‌లో తొలిసారి ప్రయోగం - Underground Metro in Hyderabad

Metro Second Phase DPR Finalized :రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్​లో దాదాపు 1,100 ఆస్తులు ప్రభావితమవుతున్నాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్‌లు జారీ చేశామని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా అవి భంగం కాకుండా చూస్తున్నామన్నారు. ఇది దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో కారిడార్.

కారిడార్ -7 ముంబయి హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభించి, పటాన్​చెరు వరకు ఉన్న ఈ 13.4 కి.మీ లైన్ ఆల్విన్ ఎక్స్​ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ -8 విజయవాడ హైవేపై ఎల్బీనగర్ వైపు నుంచి రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించనున్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 7.1 కి.మీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్​లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి.

గుడ్​న్యూస్​ - ఎల్బీ నగర్‌ టు హయత్‌నగర్ మెట్రోకు లైన్ క్లియర్ - lb nagar To hayathnagar Metro

రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో నాలుగో నగరానికి మెట్రో : సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్​ను తయారు చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని నెలల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం దీనిని సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన డీపీఆర్​లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం సుమారు రూ.8,000 కోట్లతో కలిపి మొత్తం రెండవ దశ ప్రాజెక్ట్​కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ. 24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అంచనా రూపొందించారు. ఇతర భారతీయ నగరాల్లోని ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు.

పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO

ABOUT THE AUTHOR

...view details