WTC Final Prediction 2025 : దక్షిణాఫ్రికా వరుస టెస్టు విజయాలతో దూసుకుపోతోంది. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో విజయం సాధించి వచ్చే జూన్‌లో లార్డ్స్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడే మరో జట్టు ఏది? అని అభిమానుల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా (66.67 శాతం) అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (58.89) భారత్ (55.88) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (48.21), శ్రీలంక (45.45) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (58.89) భారత్ (55.88) మాత్రమే మరో బెర్తును ఖరారు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
భారత్ ఫైనల్ చేరాలంటే సమీకరణాలు ఇలా!
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో కైవసం చేసుకుంటే ఫైనల్‌కు వెళుతుంది. కానీ, అలా జరగాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలవాలి. ఒకవేళ బీజీటీ సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్‌కు అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీలంకతో సిరీస్‌లో ఆసీస్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకూడదు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ 1-1తో ముగిసినా భారత్‌కు ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 1-0తో గెలవాలి. ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా టీమ్‌ఇండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుతోపాటు, సిడ్నీలో జరిగే చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.
మ్యాచ్ సాగిందిలా!
అయితే పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.148 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 27/3తో నాలుగో రోజు (ఆదివారం) ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మార్‌క్రమ్ (37; 63 బంతుల్లో), తెంబా బావుమా (40; 78 బంతుల్లో) రాణించడంతో సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. ఒక దశలో 93/4 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న సఫారీల జట్టు కాసేపటికే 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టెయిలెండర్ కగిసో రబాడ (31*; 26 బంతుల్లో 5 ఫోర్లు)నికార్సైన బ్యాటర్‌లా మారిపోయి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. మార్కో యాన్సెన్ (16; 24 బంతుల్లో 3 ఫోర్లు) అతడికి సహకరిస్తూ విన్నింగ్ షాట్ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ (6/54) సత్తాచాటాడు.