Hyderabad Metro Clarity On Timings :మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు ఖండించారు. మెట్రో ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయలేదని, యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు మొదలవుతాయనేది ట్రయల్లో మాత్రమే చేశామని, ఇంకా ఆ వేళల్లో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఎల్అండ్ టీ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులెవరూ మెట్రో రైళ్ల సమయాల్లో అయోమయానికి గురికావద్దని, యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని సూచించింది.
HYD Metro Trains Time Extends during Election :ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లే ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉండే విధంగా మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుండగా మే 14 వ తేదీన మాత్రం మెట్రోను ఉదయం 5 గంటల 30 నిమిషాలకే నడిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణీకుల సౌకర్యార్థమే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.