Hyderabad Police Nab Cyber Fraudsters in Gujarat :సైబర్ మాయగాళ్లు కాలర్ నలగకుండా కోట్లు రుపాయలు కొల్లగొడుతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ కొత్తదారులు వెతుకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజుకు దాదాపు 50 నుంచి 60 ఫిర్యాదులు సైబర్ ఠాణాలకు వస్తున్నాయని సమాచారం. ప్రతి నెలా దాదాపు రూ. 120 కోట్లకుపైగా కొట్టేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుకాగానే అనుమానిత బ్యాంకు ఖాతాల లావాదేవీలను పోలీసులు స్తంభింపజేస్తున్నారు.
ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల ఐపీ అడ్రసు ద్వారా నేరగాళ్లను గుర్తించి వారి ఆటకట్టిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 1000 కోట్ల రుపాయలను మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో నమోదైన 20 కేసుల ఆధారంగా గుజరాత్ వెళ్లిన పోలీసులు, 36 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కీలక ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. గుజరాత్‌లో చాలామందికి షేర్‌మార్కెట్‌పై అవగాహన ఉంటుంది. వయోభేదం లేకుండా రోజూ ట్రేడింగ్ చేస్తుంటారు. తమ అనుభవాన్ని అస్త్రంగా మలచుకున్న కొందరు, సైబర్‌నేరాలను వృత్తిగా మలచుకున్నారని పోలీసులు గుర్తించారు.
టెలీకాలర్స్ ద్వారా మోసాలు :హరియాణా, దిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని మాయగాళ్లు లక్షలపై గురిపెడితే గుజరాత్ బ్యాచ్‌లు కోట్లు కొల్లగొట్టేలా దందా సాగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆదాయపన్ను, కస్టమ్స్, జీఎస్టీ తదితర అంశాల్లో వీరికున్న పరిజ్ఞానంతో తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను రూపొందించి టెలిగ్రామ్ యాప్ వేదికగా ఇన్వెస్ట్‌మెంట్, ఫెడెక్స్ పార్సిల్, షేర్ మార్కెట్‌లో లాభాల పేర్లతో నెలకు 500 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్టు అంచనా వేశారు. గతంలో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి టెలీకాలర్స్ ద్వారా మోసాలు సాగించే ముఠాలు తాజాగా రూటు మార్చారని పోలీసుల విచారణలో తేలింది.