Hyderabad CP CV Anand Apologizes To National Media :హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేషనల్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు.
నేషనల్ మీడియాపై సంచలన వ్యాఖ్యలు :సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలియజేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్‌లో ఏం జరిగిందో తెలియజేస్తూ అక్కడి వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో మీడియా ఆనంద్‌ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా, నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు.
నేషనల్ మీడియాకు సీవీ ఆనంద్ క్షమాపణలు : దీంతో తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను కాస్త సహనాన్ని కోల్పోయానని తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుందని, తాను చేసింది పొరబాటుగా భావిస్తున్నానని అన్నారు. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని ఆనంద్ తెలిపారు.