Huge Water Inflow To Jurala Project :జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలోకి 61 వేల క్యూసెక్కులు చేరుతుండగా, 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 517.97 మీటర్లుగా ఉంది. నీటి నిలువ 123.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97.277 టీఎంసీలుగా ఉంది.
నిండుకుండను తలపిస్తున్న జలశయాలు :నారాయణపూర్ జలాశయంలోకి 65వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా 22 గేట్లు తెరిచి 68,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.55 మీటర్లుగా ఉంది. పూర్తి నీటి నిలువ 33.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.30 టీఎంసీలుగా ఉంది.
పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి :ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో జూరాల జలాశయానికి 76, వేల 238 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు 5 గేట్లు తెరిచి 60 వేల 986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.520 మీటర్లుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.682 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ ఎగువ జలవిద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లు, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.