Huge Flood Inflow To Parvati Barrage :పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్‌కు నాలుగు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంథని గుండా ప్రవహించే గోదావరి నది, బొక్కల వాగు, నల్ల వాగుల నుంచి వస్తున్న ప్రవాహంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. గోదావరి, బొక్కల వాగులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా నీటిని భారీగా విడుదల చేయడంతో సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్‌కు 4,24,915 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 74 గేట్లు ఎత్తిపెట్టి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి :ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంథని వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవాహం కొనసాగుతోంది. మండలంలోని పోతారం, ఖానాపూర్, అమ్మగారి పల్లి కాన్సాయిపేటలో వందలాది ఎకరాల్లో పంట పొలాలు గత మూడు రోజులుగా వరదనీటిలో ఉండిపోయాయి. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని గుండారం చెరువు మత్తడి పోస్తోంది.