How To Overcome From Forgetfulness :రోజూ మనం కలిసి మాట్లాడే ఫ్రెండ్స్ అయినా ఉన్నట్టుండి ఒక్కోసారి తన పేరు వెంటనే గుర్తు రాదు. ఇష్టమైన సినిమాని ఎన్నో సార్లు చూస్తుంటాం. అయినా ఆ మూవీ హీరోయిన్ పేరు అడిగితే టక్కున చెప్పలేకపోతాం. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటికి వేసిన తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తు రాదు. చాలామందికి ఇలాంటి పరిస్థితి ఏదో ఒక టైమ్‌లో ఎదురవుతుంది. ఇలా చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోవడానికి వృత్తిపరమైన టెన్షన్స్, ఒత్తిడి వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలాంటి మతిమరుపును దూరం చేసుకోవాలంటే రోజువారీ లైఫ్స్టైల్లో కొన్ని అంశాల్ని తప్పకుండా అలవాటుగా మార్చుకోవాలంటున్నారు.
పజిల్స్‌తో పదును!
డైలీ న్యూస్ పేపర్ చదవడం చాలామందికి ఉండే అలవాటు. అయితే చాలా పత్రికల్లో సుడోకు, పజిల్స్, పొడుపు కథలు, లాజిక్‌తో ముడిపడి ఉండే చిక్కు ప్రశ్నలు, వంటివి కూడా ప్రచురిస్తారు. కానీ ఇవన్నీ పిల్లల కోసమనో లేదంటే అంతగా ఆలోచించే ఓపిక లేదనో వాటిని పట్టించుకోరు చాలామంది. కానీ ఈ పజిల్స్ పూర్తి చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎక్కడ ఏ పదం సరిగ్గా నింపామో కూడా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజూ ఏదో ఒక టైంలో వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మతిమరుపును దూరం చేసుకొని జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
మెమరీ పవర్‌కూ యోగా..
మతిమరుపుకి మరో ముఖ్య కారణం తీవ్రమైన ఒత్తిడి. ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉన్నా లేదంటే ఏ పనైనా సరిగ్గా పూర్తికాకపోయినా, ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినా, మన మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ క్రమంలో చాలా విషయాల్లో మనకు తెలియకుండానే మతిమరుపు దరిచేరుతుంది. దీనికి యోగా చక్కటి పరిష్కారం అంటున్నారు ఎక్స్పర్ట్స్. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా మనలో ఒత్తిడి క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీంతో పాటు మెడిటేషన్ కూడా ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.