Free Sand Policy in Andhra Pradesh: గత ప్రభుత్వ పెద్దలు ఇసుక పేరుతో జనాన్ని దోచుకున్నారు. కోట్లాది రూపాయలు సంపాదించారు. ప్రజలు తమకు అవసరమైనా ఇసుక కొనలేక నిర్మాణాలే ఆపేశారు. దీంతో ఎన్నికల్లో కూటమి నేతలు అధికారంలోకి వస్తే ఆ విధానానికి స్వస్తి పలుకతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుక దోపిడీకి కారణమైన 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త ఇసుక విధానం-2024 అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక, పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్ ఛార్జి, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకొని, ఇసుక అందజేయాలని పేర్కొంది. ఇందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ, ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలిచ్చింది. ఇసుక ధరను ఎలా ఖరారు చేయాలి? పర్యవేక్షణ, నిఘా ఎవరు చూడాలి? అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై ఏం చర్యలు తీసుకోవాలి తదితరాలన్నింటిపై మార్గదర్శకాలతో గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వు జారీ చేశారు.
ఉచిత ఇసుక ప్రారంభం - రూ.6 వేల ట్రాక్టర్ ఇప్పుడు రూ.1500 - Free sand policy begins from today
ఉపాధికి ఇసుక కీలకం: ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగానికి ఇసుక ప్రధానమైనది. ఇసుక ధరలను నియంత్రణలో ఉంచకపోతే సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, పెట్టుబడులపై ప్రభావం, పారిశ్రామికీకరణకు విఘాతం కలుగుతుంది. నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుకను ప్రజాప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటివల్ల రాష్ట్రమంతటా భవన నిర్మాణాలు, నీటిపారుదల పనులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాజధాని భవనాలు తదితరాల నిర్మాణాలకు సరసమైన ధరల్లో ఇసుక అందుబాటులోకి వస్తుంది’ అని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
ఉచిత ఇసుక కోసం ఇలా చేయండి:
- ఉచిత ఇసుక కావాలనుకునే వారు శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ అందజేయాలి.
- ఆ తరువాత అధికారులు నిర్ణయించిన లోడింగ్, రవాణా ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి.
- ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో తీసుకుంటారు. ముందు వచ్చినవారికే ముందు లోడ్ చేస్తారు.
- ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
- ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వకేంద్రాలు పని చేస్తాయి.
- నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక ఉంది, ధర ఎంత అనేది గనులశాఖ వెబ్‌సైట్ www.mines.ap.gov.in లో అందుబాటులో ఉంటుంది.
- ఏ రోజు ఎంత ఇసుక విక్రయాలు జరిగాయి? ఇంకా ఎంత నిల్వ ఉందో రాత్రి 8 గంటలకు గనుల శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఏపీలో ఉచిత ఇసుక విధానం వచ్చేసింది- జీవో జారీ చేసిన ప్రభుత్వం - Free Sand Policy Guidelines