తెలంగాణ

telangana

ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా? - Construction Workers Scheme

దినసరి కార్మికులుగా పనిచేసే వారి ఇంటి పెద్ద మరణిస్తే కుటుంబమే రోడ్డున పడుతుంది. అందుకే.. ప్రభుత్వం ఓ స్కీమ్ తీసుకొచ్చింది. దీని ప్రకారం కార్మికుడు మరణిస్తే.. కుటుంబానికి 6 లక్షల రూపాయలు అందుతాయి.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Fatal Accident Relief Fund
Fatal Accident Relief Fund (ETV Bharat)

Fatal Accident Relief Fund:రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలు ఆ కార్మికులవి. చేతినిండా పని దొరికితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం కూలీల అడ్డాల వద్ద పనుల కోసం ఆశగా ఎదురు చూస్తూ.. దొరకని సమయంలో నిరాశగా ఇంటికి వెళ్లిపోతుంటారు. ఇదీ భవన నిర్మాణ రంగంలో పనిచేసే దినసరి కార్మికుల పరిస్థితి.

ఇలాంటి భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే.. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తోంది. చనిపోయిన కార్మికుల నామినీకి రూ. 6లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. మరి, ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు విధానమేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కార్మికుడికి గుర్తింపు ఉండాలి..

భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు మంజూరు చేస్తుంది. ఈ గుర్తింపు కార్డును కార్మికుడు కలిగి ఉండాలి. ఈ కార్డు లేనివారు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ కార్డు కలిగిన కార్మిడు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. ఈ గుర్తింపు కార్డుతో వారి నామినీ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫ్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ (ETV Bharat)

సాయం పొందడానికి అర్హతలు..

  • ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసే వ్యక్తి.. మరణించిన కార్మికుడి కుటుంబ సభ్యుడై ఉండాలి.
  • మరణించిన వ్యక్తి తప్పనిసరిగా తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి.
  • నిర్మాణ రంగ కార్మికులు పని ప్రదేశం లేదా ఎక్కడైనా సరే ప్రమాదవశాత్తూ మరణిస్తేనే ఈ సహాయం అందుతుంది.

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు

  • దరఖాస్తుదారుడి పాస్​పోర్ట్ సైజ్ ఫొటో
  • మరణించిన కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్ (ఒరిజినల్)
  • రెన్యూవల్ చలాన్ కాపీ
  • మరణ ధ్రువీకరణ పత్రం
  • పోలీస్ స్టేషన్​లో నమోదైన FIR కాపీ
  • పోస్ట్​ మార్టమ్ పరీక్ష కాపీ
  • అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
  • బ్యాంక్ పాస్ బుక్ కాపీ

దరఖాస్తు విధానం..

  • సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే.. అక్కడ దరఖాస్తు ఫామ్ ఇస్తారు. లేదంటే.. కార్మిక శాఖ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి కూడా ఫామ్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • తర్వాత దరఖాస్తు ఫామ్​లో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్​తోపాటు అడిగిన ఇతర పత్రాలను దానితో జత చేయాలి.
  • తర్వాత ఫామ్​పై సంతకం చేసి సంబంధిత కార్మిక శాఖ అధికారికి అందజేయాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు చేసినట్టుగా అధికారి వద్ద నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
  • మీ దరఖాస్తు తర్వాత.. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గని ప్రభుత్వ అధికారి దీనిపై విచారణ చేపడతారు.
  • ప్రమాదవశాత్తుగానే మరణించినట్టు నిర్ధరణ జరిగితే.. నేరుగా దరఖాస్తు దారుడి బ్యాంక్ ఖాతాలో ఆర్థిక సాయం జమ అవుతుంది.

రైతులకు కేంద్రం 'దసరా' కానుక - 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ డేట్‌ ఫిక్స్‌ - ఆ రోజునే అకౌంట్లోకి రూ.2 వేలు! - PM Kisan 18th Installment Date

రైతన్నకు సర్కారు డబుల్ బొనాంజా - సీఎం రేవంత్ దసరా కానుకలు ఇవే! - CM Revanth on Paddy

ABOUT THE AUTHOR

...view details