How to Wash Bed Sheets :బెడ్ షీట్లు ఉతకడం అనేది పెద్ద పనిగా ఉంటుంది. ఉతకక చాలా రోజులైందని అనిపించి, ఇవాళ ఏ పనీ లేదు అనుకున్నప్పుడు.. ఈ పని పెట్టుకుంటారు. ఈలోగా వారాలు, నెలలు కూడా గడిచిపోతాయి. ఈ గ్యాప్లో దుమ్ము-ధూళి, కంటికి కనిపించని సూక్ష్మ జీవులు పూర్తిగా పేరుకుపోతాయి. వాటి కారణంగా దగ్గులు, తుమ్ములతోపాటు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు, పలు చర్మ రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. బెడ్ షీట్లను క్లీన్ చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, వాయిదాలు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్ని రోజులకు ఒకసారి?
బెడ్‌షీట్లను వారానికి ఒకసారి తప్పకుండా ఉతకాలని చెబుతున్నారు. దీనివల్ల.. కొన్ని చర్మ వ్యాధులు, ఇతర రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే సమస్యలు ఉన్నవారైతే.. బెడ్‌షీట్లను తరచూ మారుస్తూ ఉండాలి. అలాగే.. అవకాశం ఉన్నంత వరకు ఎవరి బెడ్‌షీట్లు వారికి ప్రత్యేకంగా కేటాయించడం మంచిదంటున్నారు.
కొందరు పెంపుడు జంతువులను బెడ్ పైనే పడుకోబెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వాటి వెంట్రుకలు రాలిపడతాయి. వాటి చర్మం మీద ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు కూడా బెడ్‌షీట్‌కు అంటుకుంటాయి. సాధ్యమైనంత వరకు వాటిని బెడ్ మీదికి తీసుకురాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఎలా ఉతకాలి..?
దుప్పట్లు శుభ్రం చేసేటప్పుడు వేడినీళ్లు వాడాలని సూచిస్తున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా, ఇతర క్రిములు నశించడంతోపాటు మురికి త్వరగా వదులుతుంది. బెడ్ షీట్ల నాణ్యత తక్కువగా ఉంటే.. గోరువెచ్చని నీళ్లలో డిటర్జెంట్ వేసి, కాసేపు నానబెట్టిన తర్వాత ఉతకాలి.
మురికి పూర్తిగా పోవాలని కొందరు, సువాసన రావాలని ఇంకొందరు, లెక్కాపత్రం లేకుండా ఎంత పడితే అంత డిటర్జెంట్ వేస్తుంటారు. ఇలా చేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఎక్కువ మొత్తంలో డిటర్జెంట్ వాడితే.. అందులోని కెమికల్స్ బెడ్‌షీట్ క్వాలిటీని దెబ్బతీస్తాయని చెబుతున్నారు.