House Tax Issue in Sultanabad : మున్సిపాలిటీగా మారితే సదుపాయాలు పెరగుతాయని అనుకొంటే పన్నుపోటు ఇబ్బందులకు గురిచేస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాణిజ్య భవనాలు, ఇళ్లకు ఇష్టారీతిన పన్ను పెంచడంతో గగ్గొలు పెడుతున్నారు. ఆస్తి పన్నును పునర్‌పరిశీలించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఆందోళనకు దిగారు. మాకొద్దు బాబు ఈ మున్సిపాలిటీ అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జనం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
High Taxes Imposed On People :పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ను గత ప్రభుత్వం మేజర్ గ్రామపంచాయతీనుంచి పురపాలికగా మార్చింది. తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని జనం భావించారు. అభివృద్ధి మాట దేవుడెరుగు పన్ను బాదుడు(Impose Taxes) ఎక్కువైందని వాపోతున్నారు. అశోక్‌నగర్‌కు చెందిన వెంకటేశం గతేడాది కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్నును 2వేల రూపాయల నుంచి 25 వేలకు పెంచడంతో ఖంగుతిన్నారు. శ్రీరాంనగర్‌కు చెందిన నాగరాజుది ఇదే పరిస్థితి. పన్ను పెంపులో అధికారులు(Officials) కనీస నిబంధనలు పాటించలేదని కట్టి తీరాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.
"ట్యాక్స్ పెంచేందుకు ఒక పరిధి ఉంటుంది. మున్సిపాలిటీ అధికారులు ప్రస్తుతం పరిధికి మించి అధికంగా పన్నులు విధించారు. మున్సిపాలిటీగా మార్చిన వెంటనే అధిక ట్యాక్స్‌లు విధించడం సరికాదు. దీనివల్ల మా లాంటి వారిపై తీవ్ర భారం పడుతుంది. హైదరాబాద్ కరీనగర్లో కంటే అధికంగా పన్నులు విధించడం దారుణం. "- స్థానిక వ్యక్తి
HIGH Taxes Burden On People : సుల్తానాబాద్‌లో సుమారుగా 5300 నివాసాలున్నాయి. ఇందులో 800 ఇళ్లకు భారీగా పన్ను పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్నులు తగ్గించాలని ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. రోజు కూలీ పనులు చేసుకునే తమకు వేలకువేలు కట్టాలాంటే భారంగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.