Gang Raped in nizamabad :నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆటోలో మహిళను ఎక్కించుకుని తీసుకెళ్లి ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం(అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు.
అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్లో ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కూడా వారు కోరుతున్నారు.