Honour Killing of Minor Girl in Thamballapalle :అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక గత నెలలో అదృశ్యం అయ్యింది. తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం (Annamayya Honor Killing), బంధువులు, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల తీరు మీదా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
చెట్టుకు చున్నీతో ఉరి వేసుకున్న బాలిక : స్థానిక ప్రజలు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయి అతడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక కోసం గాలింపు చర్యలు చెపట్టారు. అమ్మాయిని గుర్తించిన పోలీసులు మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని సర్ది చెప్పి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించడంతో పోలీసులు అమ్మాయిని వారికి అప్పగించారు. తాజాగా పెద్దమండ్యం మండలంలో ఓ గుట్ట వద్ద ఎవరో బాలిక చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు గొర్రెల కాపరులు సోమవారం గుర్తించి వీఆర్‌వో పక్కీర్‌షా వలీకి తెలియజేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.