Maha Shivaratri Special Arrangements in Srikalahasti Temple : మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయమంతా వివిధ పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేకువ జామున రెండు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వెయ్యి మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండు డ్రోన్లు, ఈగల్ ఐ, ప్రత్యేక వివరాలతో పోలీసులు పటిష్ట భద్రతా నిర్వహణకు శ్రీకారం చుట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాహు, కేతు, సర్ప, దోష నివారణ పూజలతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. లఘు, మహా లఘు దర్శనం అమలకు చర్యలు చేపట్టారు. ఆలయానికి చేరుకునే వీఐపీల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సర్వదర్శనం, రూ.200, రూ.500 టికెట్ల దర్శనాలను అందుబాటులోకి తెచ్చారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి (Maha Shivaratri 2025) వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధర్వ రాత్రిన పురస్కరించుకొని ఆత్మ శివలింగాని పొందిన భక్తుడైన రావణుడిపై సోమ స్కంద మూర్తి, మయూర వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి కొలువదిరి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆది దంపతుల ఉత్సవం ముందు ధ్వజ పటాలం, వృషభాలు, శ్రీ వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి, చండికేశ్వర స్వామి, భక్త కన్నప్ప ఉత్సవ మూర్తులు ముందుకు సాగాయి. దేవతామూర్తులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు మాడ వీధుల్లో బారులు తీరారు. ఆలయానికి సమీపంలోని ఏర్పాటు చేసిన ధూర్జటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. దీంతో శ్రీకాళహస్తి (Srikalahasti) భూకైలాసంగా దర్శనమిస్తుంది.
శివరాత్రికి వేడుకలకు సిద్ధమవుతున్న శైవ క్షేత్రాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ సోమస్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి హంస, చిలుక వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాల అలంకరణలో ఉన్న దేవతామూర్తులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. జగద్రక్షకుని కనులారా చూసేందుకు వచ్చిన జనంతో మాడవీధులన్నీ శివనామ స్మరణలతో మార్మోగాయి. ఉత్సవంలో భక్తులు కోలాటాలు, భజనలతో అలరించారు.