ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి Honor Killing in Ibrahimpatnam :ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం ఉండదు. అడ్డుగోడలు అసలే ఉండవు. మనుషుల మధ్య ఉన్న సరిహద్దులు మనసుల మధ్య అసలు లేనే లేవు. వేరే కులం వారిని ప్రేమించారని కన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని హతమార్చుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రేమ వ్యవహారంలో తల్లి, తమ కుమార్తెను హతమార్చింది.
Ibrahimpatnam Honor Killing Case :రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని భార్గవి(19) తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో (Student Murder in Rangareddy) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మోతె జంగమ్మ - ఐలయ్య దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమార్తె భార్గవి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. భార్గవికి మేన బావతో వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించారు.
అప్పటికే గ్రామానికి చెందిన ఓ యువకుడితో భార్గవి ప్రేమలో ఉండగా, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భార్గవి ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఆమె ప్రియుడు ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన యువతి తల్లి వారిని మందలించగా యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత భార్గవి ఇంట్లో విగతజీవిగా పడి ఉండగా, తల్లి స్పృహ తప్పి పడి ఉంది.
నేను ఉదయం పొలానికి వరి కోయడానికి వెళ్లాను. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంట్లోకి రాగానే పొలంలో పనులకు ఎందుకు రాలేదు అని నా కూతురుని అడిగాను. ఆగ్రహంతో నన్ను ఏమిచేస్తావు?చంపుతావా అంటూ మీదమీదకొచ్చింది. నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే నా కాలర్ పట్టుకుని స్పహతప్పి కింద పడిపోయింది. వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. - మృతురాలి తండ్రి
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇంట్లో ఫ్యాన్‌కు భార్గవి మృతదేహాన్ని వేలాడదీసి, ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు యత్నించినట్లు గుర్తించారు. యువతి సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్గంతో పాటు స్థానికులు, కుటుంబసభ్యులను విచారించి, తల్లి జంగమ్మే భార్గవితో గొడవపడి, గొంతు నులిపి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె స్పృహలో లేకపోవటంతో విచారణ అనంతరం, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు. భార్గవి హత్యోదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పోలీసులు, తండ్రి ఐలయ్యను సైతం విచారించనున్నట్లు తెలిపారు.
ప్రేమ పేరుతో యువతి కుటుంబంపై దాడి - ప్రతిఘటనలో ప్రేమోన్మాది మృతి
ఇన్‌స్టాగ్రామ్ సాయంతో ఫ్రెండ్‌ను హత్య చేసిన స్నేహితుడు