Officials Taking Huge Bribes For House Application Approvals :మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతులు కావాలంటే కాళ్లు అరగాల్సిందే. దీనికితోడు కింది నుంచి పైవరకు అన్ని స్థాయిల్లో ముడుపులు చెల్లించుకుంటే తప్ప దరఖాస్తు ముందుకు జరగదు. ఇది బహిరంగ రహస్యం. కొందరైతే ఫ్లోర్‌కు రూ.లక్ష ఇవ్వనిదే అప్లికేషన్ ముఖంక కూడా చూడరనే ఆరోపణలు ఉన్నాయి. ఇక లేఅవుట్లు అనుమతుల్లోనూ ఇదే తతంగం నడుస్తోంది. ఈ ప్రభావం దరఖాస్తుల పరిష్కారంపై పడుతోంది. దీంతో ఉన్నతాధికారులు ప్రణాళికా విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు.
వారిపై క్రమశిక్షణ చర్యలు : ప్రతి అధికారి దగ్గర పది రోజుల కంటే ఎక్కువ రోజులు దరఖాస్తు ఆగడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంమీద ఒక దరఖాస్తు ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కావాలి. సిబ్బంది కొరత, ఇతరత్రా పలు కారణాలు చూపుతూ 3-4 నెలలు అంతకంటే ఎక్కువ సమయమే తీసుకుని దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. ఈ కారణాల ప్రభావం స్థిరాస్తి మార్కెట్‌పై పడుతోంది. ఈ నేపథ్యంలో ఏ అధికారి తన వద్ద 10 రోజులకు మించి జాప్యం చేయకూడదనే నిబంధనతో ప్రస్తుతం అనుమతుల్లో వేగం పెరిగిందని తాజాగా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు ఉద్దేశ పూర్వకంగా దరఖాస్తులను తొక్కిపెడితే వారిపై క్రమశిక్షణ చర్యలకు ఉన్నాతాధికారులు సిద్ధమవుతున్నారు.