High court On Nagaram Lands Issue :రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెం.181లోని భూమిని ప్రైవేటుకు అప్పగించిన తీరుపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందినవంటూ నిషేధిత జాబితాల్లో చేర్చుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంపై :నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ ఫరూజ్ అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి హక్కులకు సంబంధించిన వివాదాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలంటూ కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఫరూజ్ అలీఖాన్ దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అస్సెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ ఎస్పీ వేలాయుథం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అధికారులు విధుల నిర్వహణలో విఫలమైనపుడు జోక్యం చేసుకునే అధికారం హైకోర్టులకు ఉందన్నారు.