High Court Orders to Provide Security to Pulivarthi Nani:చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి (Chandragiri TDP Candidate Pulivarthi Nani) 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. అలానే పులివర్తి నాని కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. గతంలో పులివర్తి నాని ఎస్పీని కోరినా భద్రత కల్పించలేదని హైకోర్టును ఆశ్రయించారు. పులివర్తి నాని తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో 2+2 భద్రత ఇచ్చినచ్చే ఇచ్చి మళ్లి తొలగించారని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా ఉత్తర్వులు ఇవ్వలేదని న్యాయవాది అన్నారు. పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. పులివర్తి నాని, కుటుంబసభ్యులకు 1+1 భద్రత ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అధికార పార్టీకే భద్రత: ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు భద్రత కల్పిస్తుంది. కానీ విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటోంది. వైసీపీ నాయకులైతే చాలు అదేదో ఏకైక అర్హత అన్నట్లుగా భద్రతా సిబ్బందిని కేటాయించేస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీల నాయకులకు ముప్పున్నా సరే భద్రత కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ నేతల ఆదేశాలే చట్టమన్నట్లుగా పనిచేస్తున్న నిఘా, పోలీసు విభాగాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులకైతే ఓ న్యాయం విపక్షాల వారికి మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.