New Kind of Theft in Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరులో కొత్తరకం చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు బయటకు వచ్చే ప్రాంతంలో నల్ల స్టిక్కరు అతికించి, లక్షల రూపాయల కొట్టేశారు. స్టిక్కర్ అతికించడం వలన అకౌంట్ హోల్డర్ వచ్చి నగదు డ్రా చేయడానికి ప్రయత్నించినా బయటకు రాదు. ఆ తర్వాత కాసేపటికి దొంగలు వచ్చి ఏటీఎం లోపల డబ్బును దర్జాగా తీసుకుంటారు. ఈ దొంగతనం జరిగిన తీరు పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.
పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణా జిల్లా కానూరు అశోక్‌నగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో కార్డు వినియోగించినా డబ్బులు బయటకు రాకుండా లోపలే పడిపోతున్నాయంటూ ఖాతాదారులు గత కొద్దిరోజులుగా బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో బ్యాంకు అధికారులు ఏటీఎం యంత్రాలను పర్యవేక్షించే కంపెనీకి సమాచారం ఇచ్చారు.
దీంతో సదరు కంపెనీ టెక్నీషియన్ వచ్చి ఏటీఎంని వెళ్లి పరిశీలించారు. ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వచ్చే ప్లేస్‌లో లోపల వైపు నుంచి బ్లాక్ కలర్ స్టిక్కర్ అతికించినట్లు గమనించారు. దీనివల్ల నగదు ఏటీఎం బయటకు రాకుండా లోపలి వైపే పడిపోతుండటాన్ని గుర్తించారు. దీంతో ఆ టెక్నీషియన్ ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు.
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో వచ్చి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి డబ్బు వచ్చే ప్రాంతంలో నల్ల స్టిక్కర్ అతికించినట్లు రికార్డు అయింది. అదే విధంగా ఖాతాదారులు డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించినా బయటకు రాక విసిగిపోయి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత స్టిక్కరు అతికించిన ఆ ఇద్దరు వ్యక్తులు తిరిగి వచ్చి ఏటీఎం డోరును బలవంతంగా తెరిచి లోపల భాగంలో ఇరుక్కుపోయిన డబ్బులను తీసుకొని వెళ్లిపోయారు.
ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ విధంగా వారిద్దరూ ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకూ దాదాపు 2 లక్షల 22 వేల 700 రూపాయలను దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రూ.లక్షలు పెట్టి కొన్న బైక్ - ఈ చిన్న ఖర్చుతో దొంగల నుంచి కాపాడుకుందాం