Illegal Transport in andhra Pradesh : ఆదోని పట్టణం రెండో ముంబయిగా గుర్తింపు పొందింది. పత్తి, బంగారం, దుస్తుల క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. పలు ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికొస్తుంటారు. దిల్లీ, ముంబయి, తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలోని ప్రధాన నగరాలకు వెళ్లడానికి ఇక్కడి నుంచి రైలు సౌకర్యం ఉంది. అక్రమార్కులు తమ వ్యాపారానికి రైలు మార్గాన్ని రాచమార్గంగా ఎంచుకుంటున్నారు.
పోలీసు తనిఖీలు అంతగా లేకపోవడంతో రైళ్లలో బంగారం, కర్ణాటక మద్యం యథేచ్ఛగా రవాణా అవుతోంది. తాజాగా బంగారు వ్యాపారులు, ఏజెంట్లు కేరళ నుంచి రెండు రోజుల కిందట 13 కిలోల బంగారు బిస్కెట్లు ఆదోని పట్టణానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు పుణె ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేయగా 12 మంది దొరికిపోయారు.
ఆదోని రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం 21 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడి నుంచి ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని దిల్లీ, తమిళనాడులోని సేలం, చెన్నై, కోయంబత్తూరు, మహారాష్ట్రలోని పుణె, కర్ణాటకలోని బెంగళూరు, కేరళ రాష్ట్రంలోని పలు నగరాలకు రైలు సౌకర్యం ఉంది.
ఆదోని పట్టణంలోని కొందరు బంగారం వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా జీరో పద్ధతిన బంగారం అక్రమ రవాణాకు తెరతీశారు. కేరళ, చెన్నై, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఆదోని వ్యాపారులు, ఏజెంట్లు కొందరు వెళ్లి అక్కడ వ్యాపారులతో పెద్ద మొత్తంలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ధర తక్కువగా ఉందో తెలుసుకుని, అక్కడ వాటికి ఎలాంటి జీఎస్‌టీ చెల్లించకుండానే గుట్టుచప్పుడు కాకుండా రైలు మార్గం ద్వారా ఆదోనికి తెచ్చి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
అనధికార రీచ్‌ల్లోకి వరుసకడుతున్న ట్రాక్టర్లు- అప్పుడూ ఇప్పుడూ అదే దందా!
మద్యం ప్రవాహం : పశ్చిమ ప్రాంతానికి కర్ణాటక మద్యం సరఫరాకు వ్యాపారులు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. ఆదోని రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఆదోని నుంచి రాయచూరు, బళ్లారి-గుంతకల్లు-ఆదోని, బెంగళూరు-ఆదోని రైళ్లలో తీసుకొస్తున్నారు. వ్యాపారులు కొందరు ఏజెంట్లను నియమించుకొని దిగుమతి చేసుకొంటున్నారు. మరికొందరు సంచుల్లో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు తీసుకొని ప్రయాణికుల్లా వస్తున్నారు.
అంతా ‘జీరో’ మాయ : ఆదోని పట్టణంలో సుమారు వందకు పైగా బంగారం విక్రయ దుకాణాలు వెలిశాయి. వినియోగదారులు ఆయా దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసిన తర్వాత వ్యాపారులు జీఎస్‌టీతో కూడిన బిల్లులు ఇవ్వాలి. ఇందుకు కొనుగోలుదారుల నుంచి మూడు శాతం జీఎస్‌టీ కింద అదనంగా వసూలు చేయాల్సి ఉంటుంది. 90 శాతం మంది జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా జీరోపద్ధతిపైనే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కట్టడి చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి ప్రతి నెలా రూ.కోట్లలో గండి పడుతోంది.
మీ గోల్డ్ ఎంత నాణ్యత? - బంగారంలో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు