Government On School Bag Weight : ప్రస్తుతం విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడిన విద్యా బోధనతో విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. ఇంకోవైపు కేజీల కేజీల బరువైన పుస్తకాలను మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఈ పుస్తకాల భారం మరీ ఎక్కువగా ఉంటుంది. విద్యా బుద్ధులను నేర్చుకుంటూ మానసికంగా సంసిద్ధమవ్వాల్సిన చోటే చిన్నారులు శారీరకంగా అవస్థలు పడుతున్నారు. చివరికి ఈ మోత వల్ల పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీనిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం పుస్తకాల మోతకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రణాళికలు సైతం రూపొందించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువును తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సెమిస్టర్ల వారీగా అన్ని పుస్తకాలను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులను కలిపి కేవలం ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానున్నారు. దీనికి అదనంగా మరో వర్క్‌బుక్ సైతం ఉంటుంది. ఇక రెండో సెమిస్టర్‌లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇస్తారు. అలాగే వర్క్‌బుక్ ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన చర్చల్లో పాఠశాల విద్యాశాఖ అధికారులు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయనున్న పలు అంశాలను వివరించారు.
- 3-5 తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాష సబ్జెక్టులు అన్నీ కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం, వర్క్‌బుక్ ఇస్తారు.
- 9, 10 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్యపుస్తకాన్ని తొలగించి, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు.
అనుమతి లేకుండా గైర్హాజరైతే అంతే :
- ఇకపై ఉపాధ్యాయులు అనుమతి లేకుండా గైర్హాజరయితే వారికి బదిలీల సమయంలో నెలకో పాయింట్ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్ పాయింట్లు ఇస్తారు.
- సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలను నవీకరించుకోవాలి. ఇప్పటివరకు 94 వేల మంది తమ వివరాలను నవీకరించుకున్నారు.
- ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ బదిలీల్లో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి.