High Court on YSRCP Former MP MVV Case: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదైంది. కేసును కొట్టేయాలని ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనివై విచారించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. కేసు ఎఫ్‌ఐఆర్ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అదే విధంగా పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు.
Case Filed On MVV Satyanarayana:కాగా ఎంఓయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు కొద్ది రోజుల క్రితం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హయగ్రీవ భూముల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే హయగ్రీవ భూముల వ్యవహారంలో తనను బెదిరించి సంతకాలు సేకరించారంటూ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 120, 420, 34 ఐపీసీలతో సహా పలు సెక్షన్ల పై 10కి పైగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినట్లు పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఈనెల 22వ తేదీన కేసు నమోదైంది. ఎంవీవీతో పాటు ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై కూడా విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.