ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూల్చివేత ఖర్చును విజయసాయిరెడ్డి కుమార్తె నుంచి వసూలు చేయండి: హైకోర్టు - Vijayasai Daughter Encroachment - VIJAYASAI DAUGHTER ENCROACHMENT

High Court On Vijayasai Reddy Daughter Encroachment : విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ వద్ద సముద్రం నీటికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ నిబంధనలను ఉల్లంఘించి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి కాంక్రీట్‌ ప్రహరీ గోడ నిర్మించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రహరీ గోడకు కూల్చడానికి అయిన ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని సూచించింది.

High Court On Vijayasai Reddy Daughter Encroachment
High Court On Vijayasai Reddy Daughter Encroachment (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 9:53 AM IST

High Court On MP Vijayasai Reddy Daughter Encroachment :విశాఖ జిల్లా భీమిలి(భీమునిపట్నం) బీచ్‌ వద్ద సముద్రం నీటికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలను ఉల్లంఘించి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి (Penaka Neha Reddy) కాంక్రీట్‌ ప్రహరీ నిర్మించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఆ గోడను కూల్చివేశామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో కూల్చివేతలకు అయిన ఖర్చును ఎవరు భరించారని ఆరా తీసింది. జీవీఎంసీ భరించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.ప్రణతి తెలియజేయడంతో కూల్చివేతకు అయిన ఖర్చు ఎంతయిందో తేల్చాలని పేర్కొంది. ఆ ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి సూచించింది.

శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది - విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్‌ - అక్రమ నిర్మాణం నేలమట్టం - GVMC shock for vijaya sai Reddy

విచారణ వారం రోజులు వాయిదా :మొత్తం నిర్మాణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజ్‌ నోటీసు ఇచ్చామని ఎస్‌జీపీ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

నేహారెడ్డి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం :నిబంధనలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి భీమిలి బీచ్‌ ఒడ్డున నిర్మాణాలు చేపడుతున్నా, అధికారులు మౌనం వహిస్తున్నారని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని గత విచారణలో ధర్మాసనం అధికారులను ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణలో ప్రహరీ గోడను కూల్చినట్లు ఎస్‌జీపీ హైకోర్టుకు నివేదించారు. తాజాగా మరో షోకాజ్‌ ఇచ్చామని దానిపై నేహారెడ్డి స్పందన కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.

'భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు' - ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ - HC on Nehareddy Petition

ABOUT THE AUTHOR

...view details