High Court Notices Telangana Govt on Kaleswaram :మేడిగడ్డ పిల్లర్ల (Medigadda Barrage) కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించడం, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ సేకరించిన నిధుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రాత పూర్వకంగా రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జయశంకర్ భూపాపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు సీబీఐకి బదలాయించేలా ఆదేశించడం సహా ఆ విషయంపై చర్యలు తీసుకునేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేత జి.నిరంజన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీల భద్రతకు అన్ని చర్యలు తీసుకునేలా జాతీయ డ్యామ్ భద్రతా మండలికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించిన కోట్ల రూపాయల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిల్‌లో తెలిపారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోసం రెండు వారాల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరగా, ధర్మాసనం అనుమతిస్తూ విచారణ వాయిదా వేసింది.
'ఆ ఉద్యోగాల్లో మహిళలకు 100% రిజర్వేషన్- అది రాజ్యాంగ ఉల్లంఘనే'
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. న్యాయవాది బి.రాంమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. కాళేశ్వరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలతో గత సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేసినా సీబీఐ కేసు నమోదు చేయలేదని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌లో ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలూ ఉన్నందున పిల్‌తో జత చేసి ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి సునంద రిజిస్ట్రీని ఆదేశించారు.