Allu Arjun Case Update: పాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)కు ఏపీ హైకోర్టులో రిలీఫ్ లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు గతంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నవంబరు 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు తెలిపింది.
ఎన్నికల టైంలో కేసు: సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనకి స్వాగతం పలికాయి. ఆయన పర్యటనకు అధికారికంగా ఎలాంటి అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై అప్పట్లో నంద్యాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 ది రూల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 05 న విడుదల కానుంది. పుష్ప-1 ది రైజ్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టడంతో పుష్ప-2 పైనా నిర్మాతల దగ్గర నుంచి అభిమానుల వరకూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తీయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్ ఓనర్ సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. ఆ చిత్రం ఊహకు అందని విధంగా అందరికీ కొత్త అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.