Hero Allu Arjun Approaches High Court to Dismiss Sandhya Theater Case :హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనతో ఆయనతో పాటు థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అందులో పేర్కొన్నవన్ని అవాస్తవం :ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విషయాలు అవాస్తవాలని ప్రీమియర్ షోకు వస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారమిచ్చినట్లు అల్లు అర్జున్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ పేరొందిన ప్రముఖ హీరో అని అభిమానులతో కలిసి గతంలోనూ చిత్రాలు చూశారని ఆయన తరఫు న్యాయవాది పిటీషన్‌లో తెలిపారు. సంధ్య థియేటర్‌లో పుష్ప-2 చిత్రం ప్రీమియర్ షో చూసేందుకు వస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ఏసీపీ, థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు వివరించారు.
పలు సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధం :ప్రీమియర్ షో సందర్భంగా బందోబస్తులో ఏసీపీతో పాటు డీసీపీ సైతం సంధ్య థియేటర్ వద్ద ఉన్నారని, ఆయన రావడం వల్లే తొక్కిసలాట జరిగిందనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ పేరు చేర్చడం పలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. అల్లు అర్జున్ పేరు చేర్చుతూ నమోదు చేసిన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ నిర్వహించే అవకాశం ఉంది.
బెనిఫిట్ షో రోజు ఘటన : ఈ నెల 4న పుష్ప-2 బెనిఫిట్ షోను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించారు. బెనిఫిట్ షో కోసం హీరో అల్లు అర్జున్ రావడంతో తమ స్టార్ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో, పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.