Heavy Traffic in Hyderabad-Vijayawada National Highway : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తుండటంతో రద్దీగా మారింది. దసరా పండుగను సొంతూర్లలో బంధుమిత్రులతో కలిసి జరుపుకున్న పలువురు సంబురాలు ముగియడంతో తిరుగు పయనమయ్యారు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, మంగళవారం నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్‌కు చేరుకునేందుకు బయలుదేరారు. దీంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.
Festive Rush in KNR National Highway :తెలంగాణ ప్రాంతంలో దసరా, బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించుకుంటారు. దసరా సెలవులు కావడంతో, చిన్నా పెద్దా అంతా కలిసి కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలతో కరీంనగర్ -హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. భాగ్యనగరంలో నివాసం ఉన్న తెలంగాణ ప్రాంత వాసులు స్వస్థలాల నుంచి కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు పయనం అవ్వడంతో హుస్నాపూర్ టోల్ గేట్ వద్ద వాహనాలతో రద్దీ పెరిగింది. కరీంనగర్ నుంచి వచ్చే మొదటి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల, టోల్‌గేట్ దగ్గర జాప్యం జరుగుతోంది.