Heavy Rains In Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ, వట్టివాగు, మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టుల్లో ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Rains In Adilabad : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, జైనాథ్, బేల, కౌటాల మండల పరిసర ప్రాంతాల్లో పంట చేలకు వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం చిట్యాల సమీపంలోని వాగులో ఓ వాహనం ప్రమాదవశాత్తు పడింది. ఎదురుగా వస్తున్న బస్సుని తప్పించబోయి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. అటుగా వెళ్తున్న యువకులు పోలీసులకు సమాచారం అందించి పోలీసులు స్థానికుల సాయంతో ఐదుగురిని పైకి లాగి కాపాడారు.
Rain In Nizamabad :ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వాగులు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. నిజామాబాద్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ధర్పల్లి, మోపాల్, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో భారీ వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షానికి చెరువులు,కుంటలు నీటితో నిండి మత్తడి దూకుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా తరలి వస్తుండటంతో గోదావరిలోకి వదులుతున్నారు.
నిలిచిపోయిన రాకపోకలు : కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుతో పాటు ఎల్లంపల్లి పరివాహక ప్రాంతంలో క్షణక్షణం నీటి ప్రవాహం పెరుగుతోంది. జగిత్యాల గ్రామీణ మండలం అనంతారం వాగు పొంగి పొర్లడటంతో జాతీయ రహదారిపై ధర్మపురి, మంచిర్యాల వైపు రాకకపోకలు నిలిచిపోయాయి. చొప్పదండి నియోజకవర్గంలో రామడుగు మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది వర్షంలోనే మరమ్మతులు చేపట్టారు. మోతెవాగు పాత వంతెన కూలి పోవడంతో యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయింది.