A Frog Appear in Beer Bottle : ఓ వ్యక్తి చల్లని సాయంత్రం తీరిగ్గా కూర్చుని మందు కొట్టాలనుకున్నాడు. వైన్ షాపునకు వెళ్లాడు చల్లని బీరు తెచ్చుకున్నాడు. ఇక కుమ్మేద్దామనుకునే లోపు ఆ వ్యక్తికి అందులో ఏవో చెత్తలాంటి అవశేషాలు కనిపించాయి. దీంతో కంగుతిన్న సదరు వ్యక్తి ఏం చేయాలో తెలియక షాక్ గురయ్యాడు. బీర్‌లో ఉంది కప్పనే అని భావించి వీడియో తీసి సోషల్ మీడియాలో వేశాడు. ఇంకేముంది ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. ఇంతకీ అందులో ఏం ఉందో తెలిస్తే.. అనుకున్నదొక్కటీ.. అయినదొక్కటీ అని అనాల్సిందే! ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రంలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి వైన్‌షాపునకు వెళ్లాడు. అక్కడ ఒక బ్లాక్ బస్టర్ బీర్‌ను కొన్నాడు. ఇంటికి తీసుకొచ్చి తాగుదామని పట్టుకొని వెళ్లాడు. తీరా ఇంటికి వెళ్లి తాగుదామని చూసే లోపు అందులో నల్లగా చెత్త మాదిరి ఏవో అవశేషాలు కనిపించాయి. అది కప్పనని భావించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే తిరిగి వైన్‌షాపుకెళ్లి ఆ బాటిల్ తిరిగిచ్చి వైన్‌షాపు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైన్‌షాపు నిర్వాహకులు ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.
వైన్‌షాప్ నుంచి తిరిగొచ్చాక అంతకు ముందు తీసిన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వీడియో ట్రెండ్ అవడంతో ఎక్సైజ్ పోలీసుల వరకు చేరింది. దీంతో బీర్‌లో ఆ నల్లని చెత్త ఏంటని వారు వైన్‌షాపు కెళ్లి విచారించారు.
బీరు సీసాలో ఉన్నది కప్ప కాదు : ఈ క్రమంలో ఎక్సైజ్ సీఐ దిలీప్ వివరణ ఇచ్చారు. బీరులో ఉన్నది కప్ప అవశేషం కాదని, చెత్తలాంటి పదార్థమని తెలిపారు. అయితే ఈ విషయంపై మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్‌లో ఉన్నది కప్ప అయినా, చెత్త అయినా ప్రమాదమే కదా అని మండిపడుతున్నారు. ఆ బీరును చూడకుండా తాగితే సదరు వ్యక్తి ప్రాణాలు ఏం కావాలని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు.