Heavy Rains In Hyderabad: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. కుండపోతగా కురిసిన వర్షం, సిటీ రోడ్లను మరోసారి చెరువులుగా మార్చింది. మధ్యాహ్నం నుంచి మొదలైన వర్షం, క్రమంగా నగరమంతటా విస్తరించింది. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్ ప్రాంతాల్లో జడివాన పడింది. ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం : ఏకధాటిగా వర్షం కురువడం వల్ల ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోవడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది. చాలాచోట్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది.
అటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోనూ వరుణుడు విరుచుకుపడ్డాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సనత్‌నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లోనూ భారీ వర్షం పడింది. ఈ ప్రభావంతో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు విడిచిపెట్టే సమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ ప్రాంతాలైన అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బయో డైవర్సిటీ, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌లో భారీ వర్షంపై వాతావరణ శాఖ ముందే రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో రహదారులపై నీరు చేరకుండా జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏమైనా ఇబ్బందులుంటే 040 - 21111111కు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.