Heavy Rains In Hyderabad : చక్రవాతపు ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉదయం నుంచి పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వాన జోరందుకుంది. అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడలోనూ వర్షం పడుతోంది. సూరారం, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, జగద్గిరిగుట్ట పరిధిలో చిరు జల్లులు పడుతున్నాయి.
రోడ్లు జలమయం :హైదరాబాద్‌లో ఉదయం నుంచి కురిస్తున్న వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి ఉదయం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపుల్, ట్యాంక్‌బండ్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌లోనూ వర్షం పడుతోంది. కాసేపు వాన, మరికాసేపు ఎండతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. దసరా సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచే స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. పండుగ కోసం సొంతూరుకు వెళ్లిన వారు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ రద్దీకి తోడు వర్షం వలన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై వాన నీరు నిలిచిపోయి వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లపై వర్షపునీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షారు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతోనే తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్‌తో పాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.