Heavy Rains Alert To Andhra Pradesh :వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. పలుచోట్ల కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరి కోన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. రహదారులపై భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలుపుతున్నారు.
ద్రోణి ప్రభావంతో ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు :రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణా మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణా, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేసింది. ఈరోజు రాత్రికి ఇది తుపానుగా మారి ఆదివార అర్ధరాత్రికి సాగర్ ద్వీపం- ఖేపు పారా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తుపాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేకపోయినా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల పాటు ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తదుపరి వాతావరణం పొడిగా మారుతుందని స్పష్టం చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి. అలాగే ఈ రుతుపవనాలు మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని ఈ నెల 31 లోగా తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు :విజయవాడలో ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలో అత్యధికంగా 86.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు చెరువుల్లోకి నీళ్లు చేరాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి చెరువులోకి భారీగా వర్షాపు నీరు చెరింది. అలాగే రాత్రి వీచిన ఈదురుగాలులకు బెలుగుప్ప మండలంలో 150 పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే వర్షానికి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్యాణదుర్గంకు చెందిన నాగరాజు అనే రైతు అరటి తోట నీట మునిగి సుమారు రూ.3.50 లక్షల వరకు నష్టం వచ్చినట్లు తెలిపారు.
ఆ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం :కర్నూలు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. తెర్నేకల్- ఎమ్మిగనూరు మార్గంలో పలు చోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణాజిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, వీఎన్ పురం, ఇతర కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.