Holiday for Schools due To Rain in AP :దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుమలలో సైతం భారీ వర్షం పడతూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు, ఇందుకూరిపేట, కొడవలూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. డివిజన్, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు పెన్నా నది గట్లు పరిశీలించాలని రెవెన్యూ, నీటి పారుదల అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. (దసరా సెలవులు ముగియడంతో ఏపీలో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వర్షం కారణంగా పలు జిల్లాల్లో నేడూ సెలవు ప్రకటించారు. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ సెలవులు పొడిగించే అవకాశం లేకపోలేదు.)