Telangana Rainy Floods Effect :జోరువానలకి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అపార నష్టం వాటిల్లింది. ఈసారి వరదల వల్ల జరిగిన నష్టం ఎప్పుడూ జరగలేదని జిల్లావాసులు వాపోతున్నారు. వానలు తగ్గుముఖం పట్టడంతో నష్టాన్ని లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు 27 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింగి. జిల్లావ్యాప్తంగా 15చోట్ల చెరువులు, ఆరు చోట్ల కాల్వల కట్టలు తెగిపోవడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మొత్తం 11 చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 16 ప్రాంతాల్లో రహదారులపై నుంచి వర్షం నీరు ప్రవహించడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ. 92.50 లక్షలు, శాశ్వత మరమ్మతులకు రూ.2280.00 లక్షలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
సర్వస్వం కోల్పోయిన బాధితులు : కోదాడ మండలంలో తొగర్రాయి, కూచిపూడి వరద బాధల నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నాయి. గ్రామాల్లో 15కి పైగా ఇళ్లు కూలిపోగా మరో 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరదలతో 4 గేదెలు, 20 గొర్రెలు వరదల్లో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి. వరద తాకిడికి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురై కట్టుబట్టలే మిగిలాయి. తినడానికి తిండి లేక ఉండడానికి ఇళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు గ్రామస్థులు. ప్రభుత్వమే స్పందించి అన్నివిధాల ఆదుకోవాలంటూ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
జలదిగ్బంధంలోనే గ్రామాలు : కరీంనగర్ జిల్లా రాగంపేటలోని పందివాగు వరదతో సమీప గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి రాగంపేట, రేవేల్లె, పెద్దకుర్మపల్లి, దేశాయిపేట గ్రామాల ప్రజలు బయటకి వెళ్లలేని పరిస్థితి. చొప్పదండి, రామడుగు మండలాల్లోని పది గ్రామాల వరద పందివాగులోకి చేరుతోంది. వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే పరిస్థితని హై లెవెల్ వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.