Heavy Rain Across Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వాన ముంచెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వరద గుప్పెట్లో చిక్కుకుంది. అశోక్ నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణీ స్త్రీని, వృద్ధులను రెస్క్ బృందం బోటు సాయంతో వెళ్లి రక్షించింది. అటు బోనకల్ ప్రధాన రహదారిలో నాగులవంచ వద్ద ఆర్అండ్బీ రహదారిపై మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రవాణాన్ని నిలిపివేశారు. లింగాల-డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోగా, కారేపల్లిలో కస్తూర్బా పాఠశాల ఆవరణలోని వరద నీరు భారీగా చేరింది. దంసలాపురం కాలనీలోకి వరద నీరు చేరడంతో, కాలనీవాసులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు.
ఖమ్మంలోని భారీవర్షాల కారణంగా 15 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు. వాల్య తండాలో చెరువు తెగడంతో 10 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకోగా, ఓ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి అదే వరదలో మరో నలుగురు చిక్కుకున్నారు. అటు తీర్థాల వరద ఉద్ధృతిని చూసేందుకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు అక్కడే ఇరుక్కపోయారు. ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు చెరువు అలుగు పోస్తూ, వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇందిరమ్మ కాలనీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి :వైరా మండలంలో వరద ఉద్ధృతికి పలుచోట్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నల్లచెరువు పొంగి వరద నీరు ఇందిరమ్మ కాలనీకి పోటెత్తింది. నీరు ఇళ్లల్లోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ కాలనీని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.