Heavy Rain Impacts in Telangana :రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలకు పలు జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. మరోవైపు ఏక ధాటిగ వర్షం పడుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుల్తాన్పూర్ - గోరుకొత్తపల్లి గ్రామాల మధ్యలో జరుగుతున్న నిర్మాణ పనులు వర్షానికి కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హనుమకొండ జిల్లా పరకాల చలివాగు మత్తడి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ధాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడటంతో పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలు అటువైపు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. పరకాల చలి వాగు వద్ద వరద ఉద్ధృతికి చివరి పిల్లర్ వద్ద గుంత ఏర్పడటంతో మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నడికుడా మండలం కంటాత్మకూర్ వాగు వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు వరద దాటికి కొట్టుకుపోయింది. ఆ వాగును కలెక్టర్ పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గవ్యాప్తంగా ఏకధాటిగా పడుతున్న భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.