Heavy Rain Forecast in Tamil Nadu but Not a Single Drop of Rain Fall : చెన్నై నగరానికి వాతావరణ శాఖ ఇచ్చిన వర్ష సూచనలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. 15న అతి భారీ వర్షాలు అంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అత్యంత భారీ వర్షాలు సూచించే సరికి రెడ్ అలర్ట్‌గా మార్చారు. 16న అత్యంత భారీ వర్షాలొస్తాయని రెడ్ అలర్ట్ ఇచ్చినా, కనీసం నగరంలో చాలాచోట్ల వర్షాలు నమోదు కాకపోగా చుక్క వర్షం కూడా పడలేదు. ఈ తరహా వాతావరణ హెచ్చరికలతో నగరవాసులు గందరగోళానికి గురయ్యారు.
అంచనాలకు భిన్నంగా :వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా చెన్నైకి ఉత్తరం వైపుగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది. తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా దాటేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు అది తీరం దాటగానే చెన్నైలో ఎండ రావడం మరో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా జరిగాయి.
గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు తప్పాయి. చెన్నైతో పాటు కొన్ని జిల్లాల్ని అప్రమత్తం చేశారు. బుధవారం సీన్ మారడంతో గురువారం కూడా నగరంలో అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఎక్కడా చుక్క వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగానే ఇవన్నీ జరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో కేవలం కొన్నిచోట్ల మాత్రమే మోస్తరు వానలు పడ్డాయి. మణలి, తిరువొత్తియూర్‌లో 3 సెంటీమీటర్లు, కత్తివాక్కం, తండియార్‌పేటలో 2 సెం.మీ., చెన్నై కలెక్టరేట్, రాయపురం, పెరంబూర్, అయనావరంలో సెం.మీ. వర్షపాతం నమోదైంది. 16న మధ్యాహ్నం నుంచి ఎక్కడా చుక్క వానే లేదు.