Heavy Rain Alert in Andhra Pradesh: అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటు చేసింది. వర్షాల ప్రభావం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహయం కొరకు అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
కృష్ణా జిల్లాలో భారీ వర్షం - వరి నారు మడులు పోస్తున్న అన్నదాతలు - Farmers Happy Pouring Rice Paddies
ఆగ్నేయ మధ్యప్రదేశ్ సహా పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా పరిసర ప్రాంతాలపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని ఐఎండీ స్పష్టం చేసింది.