Heavy Rain Impacts in Telangana :రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుల్తాన్‌పూర్ - గోరుకొత్తపల్లి గ్రామాల మధ్య చేపట్టిన నిర్మాణ పనులు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయపర్తి మండలం జయరాం తండాలో వర్షపు నీటితో రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో మట్టి రోడ్లపై వరి నాట్లు వేసి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితిపై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల చలివాగు అలుగు పారుతోంది. వరద దాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడగా జిల్లా కలెక్టర్ అధికారులతో పరిశీలించారు.
పొలాల్లోకి వరద నీరు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దుబ్బపల్లిలో మోరంచవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. రేగొండ మండలం తిరుమలగిరిలోని పాండవులగుట్ట పై నుంచి వరద జలపాతంలా కిందకు దూకుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. చెన్నూర్, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. నదీ ఉద్ధృతికి పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వందలాది ఎకరాల పత్తిపంట నీటి మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనారోగ్యాలకు గురవుతున్న చిన్నారులు : ప్రాణహిత నది ప్రవాహం అదనుగా చేసుకుని దొంగలు టేకు దుంగలను తెప్పలుగా మార్చారు. అధికారుల కళ్లుగప్పి తరలించేందుకు నదిలో వేశారు. అంతలోపే అప్రమత్తమైన అధికారులు మూడున్నర లక్షల రూపాయల విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా అర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వాగులు పొంగిపొర్లడంతో అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు 20 కిలోమీటర్లు అడవిలో మోసుకెళ్లాల్సి వచ్చింది.